బొంగులో సినిమా రివ్యూ :
తెలుగు సినిమాలు 1990లో ఒక తరహాలో ఉండేవి. మాస్ చిత్రాలంటూ ప్రత్యేకముద్రతో కథానాయకుడితో హీరోయిజాన్ని ప్రదర్శించి ఆ వర్గాన్ని ఆకట్టుకునే ప్రయత్నాలు చేసేవారు దర్శక నిర్మాతలు. ఆ పరంపర 2012 వచ్చినా ఇంకా కొనసాగుతూనే ఉంది. గాడ్‌ఫాదర్ చిత్రం దేశ సినిమా చరిత్రను మార్చినట్లే... బాష చిత్రం తెలుగు సినిమాను మార్చేసింది. అప్పటినుంచి ఆ తరహా కథలే తెరపైకి వస్తున్నాయి. రామ్‌చరణ్, తమన్నా జంటగా నటించిన సినిమా 'రచ్చ'. సంపత్ నంది దర్శకుడు. ఎన్.వి. ప్రసాద్, పారస్‌జైన్ నిర్మాతలు. ఆర్‌బి. చౌదరి సమర్పకుడు. అభిమానుల కోసమే చేసిన సినిమా ఇది. వారు కోరుకునే అన్ని అంశాలూ ఇందులో ఉంటాయి అని మొదటినుంచి చెబుతున్నట్లేగానే ఉంది. అందుకే అభిమానులు ఎప్పుడూ ఒకేలా ఉండాలనుకోవడంలో ఆశ్చర్యంలేదు.
ఊరికోసం మంచిచేసే వ్యక్తి ఉన్నట్లే తన స్వార్థంకోసం ఆ వ్యక్తి తన బావైనా సరే చంపేసే బావమర్దుల కథతో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. కథ ఇదే అయినా చెప్పే విధానం కొత్తగా ఉండడమే స్క్రీన్‌ప్లే చమక్కు. అది ఎంత ఆకర్షణీయంగా ఉంటే సినిమా అంత బాగుంటుంది. అందుకే అటువంటి కథను తీసుకుని దానికి ప్రేమ, మాస్ మసాలా జోడించి తీసిన సినిమా 'రచ్చ'. ఇందుకు సంబంధించిన కథాకమామీషుని పరిశీలిస్తే...
రాజ్ (రామ్‌చరణ్) తన చిన్నతనంలోనే ఊరికి మంచి చేయాలనుకునే తన తల్లిదండ్రుల్ని పోగొట్టుకుంటాడు. తర్వాత సిటీలో ఎం.ఎస్.నారాయణ, సుధ దగ్గర పెరిగి పెద్దవాడవుతాడు. బెట్టింగ్‌లు చేయడం అతని వ్యాపకం. ఈ క్రమంలో పెంచిన తన తండ్రి ఎం.ఎస్. నారాయణ అనారోగ్యంపాలైతే లివర్‌ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలంటారు డాక్టర్లు. దానికి 20లక్షలు కావాలి. ఈ విషయం తెలిసి తన దగ్గరకు వచ్చిన ఓ బెట్టింగ్‌ను రాజ్ ఒప్పుకుంటాడు. దాని ప్రకారం కోటీశ్వరుడైన రాక్షస ప్రవృత్తిగల బళ్ళారి (ముఖేష్‌రుషి) కూతురు చైత్ర (తమన్నా)ను ప్రేమించాలి. అదికూడా నెలలోపు ఆమెచేత ఐలవ్‌యు చెప్పించాలి. రాజ్ అలాగే చేస్తాడు. ఇది తెలిసిన తమన్నా తండ్రి రాజ్‌తోపాటు చైత్రకూ టార్కెట్ పెడతాడు. అతని బారినుంచి తప్పించుకుంటూ వాళ్ళిద్దరూ శ్రీశైలం ఫారెస్ట్‌కు చేరతారు. అప్పటికి రాజ్‌కు కొన్ని విషయాలు తెలుస్తాయి. ఆ తర్వాత రాజ్ ఏమి చేశాడు అన్నది కథ.
రాజ్ చిన్నతనంలోని సన్నివేశాలు, కథాగమనం అచ్చుగుద్దినట్లు తెలుగులో పలు సినిమాలను మాలగా అల్లినట్లుంటాయి. రొటీన్ తెలుగు సినిమాకు నిలువెత్తు నిదర్శనంగా మాటలు, ఫైట్లు, పాటలున్నాయి. కథ సీరియస్‌గా సాగుతున్న టైమ్‌లో వెంటనే ఓ పాట వచ్చేస్తుంది. పురాతన పద్ధతుల్లో కథనం సాగినా పునాదులు బలంగా లేకపోవడంతో సెకండాఫ్ ట్రాక్ తప్పింది. అందులో వచ్చే ట్విస్ట్‌లు ముందే తెలిసిపోతుంటాయి. క్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్ కూడా హీరో వందమందిని కొట్టేయడం మామూలే.
రామ్‌చరణ్‌లో చిరంజీవి కన్పిస్తాడు. ఎక్కువభాగం తండ్రినే అనుకరించాడు. తండ్రి చేసిన మాస్టర్‌పీస్‌ల జోలికి వెళ్ళకుండా సొంత గుర్తింపుకు ప్రయత్నిస్తే బాగుండేది. సినిమాను చూసేది కేవలం చిరు అభిమానులేకాదు. అందరి అభిమానులు ఉంటారనే లాజిక్కును మర్చిపోకూడదు. వారికోసమే సినిమా తీశామంటూ... వారి ఆలోచనలు ఇన్నేళ్ళయినా మారవు అనే అర్థాన్నిచ్చేలా ఉండకూడదు. దాని వల్ల హీరోగా ఎదగాలనుకునే ఏ హీరోకైనా ఇబ్బందే. ఈ విషయాన్ని పరిశీలించుకోవాలి. ఎంత కష్టపడి డాన్సులు, యాక్షన్‌లు చేసినా ఫైనల్‌గా చూసేది ప్రేక్షకులు కాబట్టి ఆదిశగా చిత్రాలు తీస్తే బాగుంటుంది.
కామెడీ పేరుతో ధర్మవరపు, అలీ పాత్రల్లో ద్వందార్థాలు బాగానే ఉన్నాయి. సీనియర్స్‌రచయితలుగా పరుచూరిబ్రదర్స్ కొత్తదనం లేకపోయినా... ఒకప్పుడు మాస్ మెచ్చినట్లే ఇప్పుడూ మెచ్చుతారనే తరహాలోనే సంభాషణలు ఉన్నాయి. 'కరెంట్‌కోత చూశావ్. వరికోత చూశావ్. ఊచకోత చూడలేదంటు..' ఎల్‌బిశ్రీరామ్ చేత చెప్పిస్తూ... హీరోకు కత్తి ఇచ్చి విలన్లు చంపమనే డైలాగ్‌లు పక్కామాస్. అలాగే హీరోయిన్ ఉద్దేశించి.. కండ తక్కువ కటింగ్ ఎక్కువ..'అంటూ పలికే డైలాగ్‌లూ ఉన్నాయి. మొత్తం సినిమా చూశాక.. నిజమే కథలో పట్టు లేదనిపిస్తుంది.

No comments:
Post a Comment